రంగాపురంలో యాదయ్య అనే బిచ్చగాడు ఒకడు ఉండేవాడు. పని చేసి డబ్బు సంపాదించుకునేందుకు శక్తి ఉన్నా, ఊరికే అందరినీ అడుక్కొని డబ్బు సంపాదించుకునేవాడు అతను. "కష్టపడి డబ్బు సంపాదించుకోవచ్చుకదా?" అని ఎవరైనా అతనిని అడిగితే, "నా కష్టాలేవో నేను పడతాను నీకెందుకు?" అని పొగరుగా సమాధానమిచ్చేవాడు.
ఆ ఊరిలోనే సౌజన్య అనే అమ్మాయి ఉండేది. తను చాలా తెలివైనది. యాదయ్య తీరును గమనించిన సౌజన్య, అతనితో ఎలాగైనా మార్పు తేవాలనుకొని, ఆలోచించింది. తనకొక పథకం తట్టింది.
ఒకరోజు యాదయ్య బిక్షాటన చేస్తుండగా, సౌజన్య అతనిని పిలిచి "ఒక్కసారిగా ధనవంతులు కావాలంటే ఏం చెయ్యాలో నాకు తెలుసు. నీకు ఒక్కసారిగా ధనవంతుడివి కావాలని లేదా?" అని అడిగింది.
"ఎందుకు లేదు?" అన్నాడు యాదయ్య, కొంత తడబడుతూ. మరైతే "నువ్వు జామకాయ వ్రతం చేయాలి" చెప్పింది సౌజన్య. యాదయ్య తెల్లమొహం వేశాడు-"జామకాయ వ్రతమా?! దాన్ని ఎలా చేయాలి?" అని.
"అదేమంత కష్టమైన వ్రతం కాదులే, నువ్వు సులభంగానే చెయ్యగలవు. వ్రతం చెయ్యాలనుకునేవాళ్ళు ముందు ఒక మూట జామకాయలు కొనాలి. ఒక్కో జామపండును రెండు రూపాయలకు ఒక్క పైసా తగ్గించకుండా అమ్మాలి. ఇలా వరసగా పదిహేను సార్లు చెయ్యాలి. ఇలా వచ్చిన డబ్బులను మితంగా, అవసరమైనంత వాడుకోవచ్చు కూడా. ఇంకేమి, మిగిలిన డబ్బులను దాచుకుంటే సరి. ఎంత డబ్బును దాచుకుంటే అంత ధనవంతుడివి అవుతావు నువ్వు!" చెప్పింది సౌజన్య ఉత్సాహంగా.
యాదయ్య తన దగ్గర మూట జామకాయలు కొనడానికి డబ్బులు లేవన్నాడు. "అయ్యో! సొంత డబ్బులు వాడుకోకపోతే వ్రతం ఫలించదే?! మొదటిసారి జామకాయలకోసం నీ ఇంట్లో ఉన్న పైసా పైసా వాడుకుంటే తప్ప ప్రయోజనం ఉండదు. నేనేమీ చెయ్యలేను" అన్నది సౌజన్య.
"సరే, చూస్తానులే. ఇంట్లో అంతా వెతికితే ఒక మూటకు సరిపడా డబ్బులు దొరక్కపోవు" అన్నాడు యాదయ్య కొంచెం ఆలోచించి.
మరునాడే అతను జామకాయల మూటను కొని, సౌజన్య చెప్పినట్లు, చక్కగా అమ్ముకున్నాడు. సౌజన్య కూడా వాళ్ల అమ్మా నాన్నలిచ్చిన డబ్బుతో అతని దగ్గర కొన్ని జామకాయలు కొనుక్కున్నది. అట్లా వరసగా పదిహేను రోజుల పాటు జామకాయలు అమ్మాడు యాదయ్య.
వ్రతం అయిపోయాక చూస్తే, ఆశ్చర్యం! యాదయ్య దగ్గర చాలా డబ్బు ఉన్నది! అతను సౌజన్య దగ్గరకు వెళ్ళి, సంతోషంగా "నీ వల్లే నాకు ఈ వ్రతం గురించి తెలిసింది. ఇందులో కొంత డబ్బు నువ్వు తీసుకో!" అన్నాడు. సౌజన్య అప్పుడు నవ్వుతూ "నిజానికి జామకాయ వ్రతం అనేది ఏదీ లేదు యాదయ్యా! 'ఊరికే అడుక్కుని బ్రతుక్కోవచ్చు' అనే నీ ఆలోచనలో మార్పు తెచ్చేందుకే ఇలా చేశాను. కష్టపడి పనిచేసి బ్రతకటంలోని సంతోషం ఇప్పుడు నీ అనుభవంలోకి వచ్చింది కదా, అది చాలు నాకు" అన్నది.
శ్రమశక్తితో సంపాదించిన డబ్బు విలువను రుచి చూసిన యాదయ్య ఇక ఆ రోజునుండీ కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించటమే కాదు; వాటిని పొదుపుగా వాడుకొని, చూస్తుండగానే తన వ్యాపారాన్ని విస్తరించుకున్నాడు. సుఖంగా జీవించాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి